Thursday, October 1, 2015

ది పవర్ ఆఫ్ విమెన్

ఈనాడు పత్రిక సహకారంతో

రాగులూ, జొన్నలూ, కొర్రలూ, సామలూ.. ఇలాంటివన్నీ ఒకప్పుడు పేదల ఆహారం. కానీ, ఆరోగ్యరీత్యా ఇప్పుడు వాటిని సంపన్నులూ తింటున్నారు. పూర్వం మన పెద్దలు తీసుకున్న ఆహారం తింటేనే ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది అని చాలామంది భావిస్తున్నారు. దీన్నే పదిమందికీ చెప్పాలనే ఉద్దేశంతో ‘అహోబిలం మిల్లెట్‌ కేవ్‌ రెస్టారంట్‌’ని ప్రారంభించారు హేమమాలిని. తానే సొంతంగా వాటిని పండిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే..
మాది తూర్పు గోదావరి జిల్లా. మా వారిది హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం కావడంతో ఇరవై ఏళ్ల క్రితం నేనూ ఇక్కడికే వచ్చేశా. అప్పట్లో నేను డిగ్రీ చదువుకున్నా. పెళ్లయ్యాక ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యా. అధిక రక్తపోటూ, మధుమేహం, బరువు పెరగడం లాంటి సమస్యలు నాతో పాటూ మా ఇంటిల్లిపాదినీ ఇబ్బందిపెట్టాయి. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది. ‘తృణధాన్యాలు తీసుకోవడమే దీనికి పరిష్కారం’ అని చాలామంది చెప్పారు. అనారోగ్యం తగ్గించుకోవడానికి ఆయుర్వేద తరగతులకు హాజరయ్యేదాన్ని. అక్కడా ఇదే చెప్పారు. దాంతో వాటిని తెప్పించుకుని వాడటం మొదలుపెట్టా. ఆశ్చర్యంగా మూడేళ్ల నుంచీ ఉన్న సమస్యలు మూడు నెలల్లో తగ్గిపోయాయి. అప్పుడే నాకు అందిన ప్రయోజనాల గురించి నలుగురికీ చెప్పడం మొదలుపెట్టా. ‘హైదరాబాద్‌లో కొర్రలూ, సామల వంటివి దొరకడం లేదు’ అని కొందరూ, ‘అన్నీ రసాయనాలతో పండించినవే కదా’ అని ఇంకొందరూ అనేవారు. పల్లెల్లో ఎరువులు వాడకుండా పండించిన తృణధాన్యాలను తెచ్చి అమ్మాలనుకున్నా. రెండేళ్ల క్రితం రెండు లక్షల రూపాయలతో ఒక ఆర్గానిక్‌ స్టోర్‌ ప్రారంభించా. మూడు నెలలు గడిచేసరికి మరికొన్ని సమస్యలు! కొనడానికి వచ్చిన వాళ్లు ‘వాటినెలా వండాలీ’ అంటూ ప్రశ్నించే వారు. అన్ని వెరైటీలు నాక్కూడా తెలియదు. అదే చెబితే, చాలామంది కొనడం తగ్గించేశారు. అప్పుడే మా అత్తగారు ‘వాటిని తయారుచేసే రెస్టారంట్‌ పెట్టొచ్చు కదా’ అని సలహా ఇచ్చారు. అలా ఏడాదిన్నర క్రితం ‘అహోబిలం మిల్లెట్‌ కేవ్‌ రెస్టారంట్‌’ ప్రారంభించా.

మొదట్లో పదిమందే : ఆరు లక్షల పెట్టుబడితో మాదాపూర్‌లో రెస్టారంట్‌ ప్రారంభించా. తూర్పుగోదావరి నుంచి తృణధాన్యాలతో వివిధ వంటకాలను బాగా చేసే ఐదుగురు వంటవాళ్లను పిలిపించా. ఇవి ఆరోగ్యాన్నిస్తాయని చాలామందికి తెలుసు. కానీ, అవి రుచిగా ఉండవనేది కొందరి అభిప్రాయం. అందుకే నిపుణులైన వంటవాళ్లని పిలిపించి రుచికరంగా వండించడం మొదలుపెట్టా. అంతా బాగానే ఉంది. కానీ రోజుకు పదిమందికి మించి వచ్చే వాళ్లు కాదు. నెల తిరిగే సరికి రెస్టారంట్‌ అద్దె, పని వాళ్ల జీతాలూ, వండిన ఆహారం... అన్నీ నష్టమే. నాలుగు నెలల పాటు ఇదే కొనసాగింది. దాదాపు మూడు లక్షల రూపాయల నష్టం తేలింది. ఓ సారి ‘మూసేద్దాం’ అన్న నిర్ణయానికి వచ్చా. అయినా నా ఆలోచన మంచిది. ఎంత కష్టమైనా వెనుకడుగు వేయకూడదనుకున్నా. ఆ దిశగా అడుగులేసి మార్పులు చేశా. మొదట్లో హోటల్‌కి పేరు కూడా ఉండేది కాదు. మొట్టమొదట ఆ పనే చేపట్టా. దగ్గర్లో ఉన్న సుమారు యాభై సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో మాట్లాడా. మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పా. మంచి స్పందన వచ్చింది. ఇది ఓ రకంగా నాలో ఆత్మస్థైర్యాన్ని నింపింది. నెమ్మదిగా మా ఆహారానికి అభిమానులు పెరుగుతూ వచ్చారు. ఒక్కసారి ఇక్కడికొచ్చి రుచి చూసిన వాళ్లు మళ్లీ ఇక్కడికే వచ్చేవాళ్లు. ఇక్కడ తిన్నాక తమ ఆరోగ్యం చాలావరకు మెరుగుపడిందని అనేవారు. తమకు తెలిసిన వాళ్లకి దీని గురించి చెప్పేవారు. నగరంలో చాలాచోట్ల దొరకని పదార్థాలు మా దగ్గర దొరుకుతుండడంతో మా గురించి చాలామందికి తెలిసింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల తాకిడి పెరిగింది.

మేమే పండిస్తాం: ఇక్కడ వాడే తృణధాన్యాల్ని మేమే స్వయంగా పండిస్తాం. దీనికోసం రెండేళ్ల ముందు నుంచే కసరత్తు చేశా. సహజ ఎరువులతో పండించిన వాటినే మా రెస్టారంట్‌లో వాడుతున్నా. రెండేళ్లు సహజ ఎరువులతోనే పండించి, భూమిలో రసాయనిక గుణాలు తొలగిపోయాక వేసిన పంటనే ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశా. ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని అహోబిలం దగ్గర నలభై ఎకరాల భూమి తీసుకుని అక్కడ కొంతమంది రైతులకు అప్పగించి పండిస్తున్నా. ఆవు పేడనీ, మూత్రాన్నే ఎరువుగా వాడుతున్నాం.

మట్టిపాత్రల్లోనే: ఇప్పుడు చాలామంది గ్రామీణ వాతావరణం కోరుకుంటున్నారు. అలాంటి భావన కలిగించడానికి మేం మట్టిపాత్రలని ఉపయోగిస్తున్నాం. వండేదీ, వడ్డించేదీ అంతా మట్టి పాత్రల్లోనే. చివరికి నీళ్లూ, మజ్జిగ కూడా మట్టి పాత్రల్లోనే ఇస్తాం. ఇక వడ్డించే పదార్థాలంటారా... ఉదయం, సాయంత్రం అల్పాహారం కింద తృణధాన్యాలతో చేసిన ఇడ్లీలూ, దోశలూ, ఉప్మా, పకోడీ ఉంటాయి. మధ్యాహ్నం లంచ్‌కి జొన్న రొట్టెలూ, దంపుడుబియ్యంతో చేసిన అన్నం, సాంబార్‌ రైస్‌ని సిద్ధం చేస్తాం. ఒక్కోరోజు రాగి సంకటి, బొబ్బర్ల పులుసు వంటి ప్రత్యేక వంటలు ఉంటాయి. ‘స్విగ్గీ’ అనే ఓ యాప్‌ ద్వారా మా రెస్టారంట్‌లో దొరికే వివిధ పదార్థాలని ఆర్డర్‌ చేస్తే, ఇంటికి తెచ్చిస్తాం. ఇంకా కొర్రల బిర్యానీ, కొర్ర బిసిబెళా బాత్‌, కొర్ర పులిహోరా, మినప వడలూ, జొన్న రొట్టె, జొన్న సమోసా, మల్టీ మిల్లెట్‌ రోటీ, రాగులూ కొర్రలతో చేసిన మిఠాయిలూ మా ప్రత్యేకత. ఇలా మొత్తం 30 రకాల వంటకాలు మా దగ్గర దొరుకుతాయి. బెల్లం, ఆవు నెయ్యితో స్వీట్లు తయారుచేస్తాం. శుక్ర, శని, ఆదివారాల్లో బఫె, లంచ్‌, డిన్నర్‌ ఉంటుంది.

సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు అందిస్తున్నా: ఇప్పుడిప్పుడే మా రెస్టారంట్‌కి ఆదరణ పెరుగుతోంది. నారాయణ స్కూల్‌, టెక్‌ మహీంద్రా, గూగుల్‌ సంస్థలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. ఇన్ఫోసిస్‌, సీఎస్‌టీలతోనూ ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రతిరోజూ మూడొందల భోజనాలు ఇలా ఆర్డర్‌ మీద అందిస్తున్నాం. అప్పట్లో నలుగురు పనివాళ్లు ఉండేవాళ్లు. ప్రస్తుతం పదిహేను మంది పనిచేస్తున్నారు. మధ్యాహ్న భోజనాలకూ... ప్రత్యేక సందర్భాలకూ ఆర్డర్‌ ఇచ్చే వారి సంఖ్యా పెరిగింది. రాజమౌళిలాంటి ప్రముఖులూ మా రెస్టారంట్‌కి వస్తున్నారు. ప్రస్తుతం మా రెస్టారంట్‌కి రోజుకి రెండొందల మంది దాకా వస్తున్నారు. ఆదాయమూ పెరిగింది. టర్నోవర్‌ యాభై లక్షలు దాటింది. వ్యాపారం పెరిగిన సంతోషం కన్నా ఇక్కడికి వచ్చి తిన్నాక చాలామంది బరువు తగ్గామనీ, వ్యాధులు అదుపులోకి వచ్చాయనీ చెబుతుంటే చాలా ఆనందమేస్తోంది. నేను తీసుకున్న నిర్ణయం సత్ఫలితాన్నిచ్చిందన్న తృప్తి కలుగుతోంది.

1 comment: