Saturday, July 12, 2014

మోడీ టు బ్రెజిల్....!

ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే అయిదు దేశాల ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బ్రెజిల్ వెళ్తున్నారు. ఒక అభివృద్ధి బ్యాంక్‌ను ఏర్పాటు చేయడంపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవడంతో పాటుగా ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సంస్కరణలకు గట్టిగా డిమాండ్ చేయవచ్చని భావిస్తున్నారు.
 ఆదివారం రాత్రి బెర్లిన్‌లో ఆగిన తర్వాత మోదీ ఈ నెల 15న జరిగే బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల నేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం కోసం బ్రెజిల్ తూర్పు తీర నగరమైన ఫోర్టలెజాకు సోమవారం వెళ్తారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ దేశాల నేతలతో చర్చించడానికి ఈ సమావేశం మోదీకి తొలి అవకాశం కల్పించనుంది.
బెర్లిన్‌లో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మోర్కెల్‌తో సమావేశం కావాలని మోదీ ఇంతకు ముందు అనుకున్నారు. అయితే జర్మనీ ప్రపంచ ఫుట్‌బాల్ ఫైనల్‌కు చేరుకోవడం, ఈ మ్యాచ్‌ని చూడడం కోసం ఆమె బ్రెజిల్‌లో ఉండనుండడంతో ఆ ఆలోచనను ఆయన విరమించుకున్నారు. ప్రధాని వెంట ఆర్థిక శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు ఎకె దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్, ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారామ్‌లతో కూడిన ఓ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వెళ్తోంది.
గత ఏడాది డర్బన్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును ఈ ఆరవ శిఖరాగ్ర సమావేశం చర్చించడమే కాక చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా ప్రపంచ నేతలను కలుసుకుని ద్వైపాక్షిక అంశాలను చర్చించడానికి కొత్త ప్రధాని మోదీకి తొలి అవకాశం కల్పిస్తోంది.
 శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఫోర్టలెజాలో సమావేశంలో ఒక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు ప్రారంభం కాగా, విదేశాంగ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుజాతా మెహతా మోదీకి సహాయ, సహకారాలు అందిస్తున్నారు. ప్రపంచ భూభాగంలో నాలుగో వంతు భూభాగం, జనాభాలో 40 శాతం బ్రిక్స్ దేశాల్లోనే ఉండగా, ఈ దేశాల మొత్తం జిడిపి 24 లక్షల కోట్ల డాలర్ల పైమాటే.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, అలాగే ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు చేపట్టవలసిన అవసరంపై ఈ సమావేశం ఒక తీర్మానం చేస్తుందని భారత్ ఆశిస్తున్నట్లు అధికారులు చెప్పారు. పది వేల కోట్ల డాలర్ల కార్పస్ ఫండ్‌తో ఒక అభివృద్ధి బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని డర్బన్‌లో గత ఏడాది జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడు ఫోర్టలెజాలో జరగబోయే సమావేశంలో ఈ నిర్ణయం ఒక స్పష్టమైన రూపానికి వచ్చే అవకాశం ఉంది. ప్రతి సభ్య దేశం ఈ బ్యాంక్‌కోసం తన వంతుగా ఎంత మొత్తం ఇవ్వాలి, ఈ అభివృద్ధి బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని న్యూఢిల్లీ లేదా షాంఘైలో ఏర్పాటు చేయాలా అనే దానిపైనా చర్చలు జరుగుతున్నాయి.

No comments:

Post a Comment